ఉరవకొండ, జూలై 15:
గుంతకల్ డీఎస్పీ పర్యవేక్షణలో ఉరవకొండ సీఐ, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో ఇటీవల వరుసగా ఆలయాల్లో జరిగిన హుండీ చోరీల కేసులను ఛేదించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ ఉద్భవ మహాలక్ష్మి ఆలయంలో జూలై 7/8 తేదీల రాత్రి, అలాగే కొనకొండ్ల గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జూలై 12/13 తేదీల రాత్రి హుండీలు, హుండీలోని నగదును అపహరించిన ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేశారు.
అరెస్టయిన నిందితులు గుంతకల్లు పట్టణానికి చెందిన తోటకూర గుజ్జల విశ్వతేజ (21), తలారి వంశీకృష్ణ (20), బోయ మహేష్ (20)గా పోలీసులు గుర్తించారు. ఉరవకొండ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వజ్రకరూరు మండలంలోని ఎస్‌వీ గోదాం సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.20,600 నగదు, పెన్నహోబిలం ఆలయానికి చెందిన నాలుగు సీసీ కెమెరాలు, వజ్రకరూరు మండలంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి చెందిన ఒక హుండీ, అలాగే చోరీలకు ఉపయోగించిన ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
