కళ్యాణదుర్గంలో లక్ష ఎకరాలకు కమ్యూనిటీ డ్రిప్ అమలు చేయాలి: సీపీఐ

జీడిపల్లి, ఇతర రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించాలి.. బీటీపీ, పేరూరు ప్రాజెక్టులకు కృష్ణా జలాలు కేటాయించాలని డిమాండ్

కళ్యాణదుర్గం, ఆగస్టు 2: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జీడిపల్లి, ఇతర రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాలకు మెగా కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషన్‌ అమలు చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. ఆదివారం కళ్యాణదుర్గంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఉరవకొండ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్‌ అమలు చేస్తున్న ప్రభుత్వం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాత్రం అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కళ్యాణదుర్గంలోనూ మెగా కమ్యూనిటీ డ్రిప్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.

జీడిపల్లి–బీటీపీ పనులు పూర్తి చేయాలి

జీడిపల్లి–బీటీపీ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో కాంట్రాక్టర్‌గా స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని సీపీఐ నాయకులు ఆరోపించారు. అలాగే ఎస్‌ఆర్‌సీ నుంచి వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

బీటీపీ ద్వారా నీరు అందే 114 చెరువుల జాబితాను ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని కోరారు.

కృష్ణా జలాలను కేటాయించాలి

బీటీపీ, పేరూరు రిజర్వాయర్లకు కృష్ణా జలాలను మళ్లించి సాగునీరు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న 4.4 టీఎంసీల నికర జలాలను కళ్యాణదుర్గం ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు.

పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి

తిమ్మసముద్రంలోని ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ముఖ్యంగా టమోటా, మామిడి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తే రైతులకు, యువతకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఆగస్టు 4, 5న సీపీఐ బైక్ జాతా

ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 4, 5 తేదీల్లో నిర్వహించనున్న సీపీఐ బైక్ జాతాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఓంకార్, బ్రహ్మసముద్రం మండల కార్యదర్శి నాగరాజు నాయక్, పట్టణ సహాయ కార్యదర్శులు బుడెన్, సల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.