గవి మఠం సేవలో కొత్త అధ్యాయం

 

సహాయ కమిషనర్, మేనేజర్‌గా బోయపాటి సుధారాణి బాధ్యతల స్వీకరణ


ఉరవకొండ, ఆగస్టు 3:


ఉరవకొండ శ్రీ గవి మఠ సంస్థానానికి కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, సహాయ కమిషనర్ మరియు మేనేజర్‌గా బోయపాటి సుధారాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖలో విశిష్ట సేవలతో మంచి గుర్తింపు పొందిన ఆమె రాకతో గవి మఠం అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందనే ఆశాభావం భక్తుల్లో, సిబ్బందిలో వ్యక్తమవుతోంది.

సుధారాణి గతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్యనిర్వాహణాధికారిణి (ఈవో)గా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. పారదర్శక పరిపాలన, భక్తులకు మెరుగైన సేవలు, దేవస్థాన అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తరువాత ఆత్మకూరు మండలం పంపనూరు దేవస్థానానికి బదిలీపై వెళ్లి అక్కడ కూడా సమర్థవంతమైన పరిపాలనతో ప్రశంసలు అందుకున్నారు. పనిచేసిన ప్రతి చోట తనదైన ముద్ర వేసుకుంటూ మంచి ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు.

తాజాగా ఉరవకొండ శ్రీ గవి మఠ సంస్థానానికి బదిలీపై వచ్చిన ఆమె సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవస్థాన సిబ్బంది, అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ, గవి మఠం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఆమె సేవలు కొనసాగాలని పలువురు ఆకాంక్షించారు.