-
.
వందకు చేరువలో వాణిజ్య వాహనాలు.. ఉరవకొండ డిపోకు భారీ ఆదాయ నష్టం?
అధికారుల నిర్లక్ష్యమా.. రాజకీయ అండదండలా.. లేక పర్యవేక్షణ వైఫల్యమా?
ప్రైవేట్ వాహన దారుల మధ్యడిష్యుం.. డిష్యుం.
పోలీస్ స్టేషన్ లో పంచాయతీ
ఉరవకొండ: ఒకవైపు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరోవైపు ఉరవకొండలో నియంత్రణ లేకుండా నడుస్తున్న ప్రైవేటు వాణిజ్య వాహనాలు ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆర్టీసీ, రవాణా శాఖ, పోలీసు శాఖల పర్యవేక్షణపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
ఉరవకొండ–అనంతపురం ప్రధాన రహదారిలో ప్రస్తుతం సుమారు 54 ప్రైవేటు వాహనాలు నిత్యం ప్రయాణికులను తరలిస్తున్నాయని సమాచారం. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వందకు చేరువలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆర్టీసీ డిపో సమీపంలోనే వాహనాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రభుత్వ బస్సులకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతోందని ఆరోపిస్తున్నారు.
రూ.100 చార్జీ... ఒక్కో వాహనానికి రోజుకు వేల రూపాయల ఆదాయం
ఉరవకొండ నుంచి అనంతపురానికి ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వాహనం రోజుకు సుమారు రూ.2 వేల వరకు ఆదాయం పొందుతోందని వాహనదారులే చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు లక్షల రూపాయలు, ఏడాదికి కోట్ల రూపాయల మేర ప్రభుత్వ రవాణా సంస్థకు రావాల్సిన ఆదాయం మళ్లిపోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆర్టీసీ డిపో ఎదుటే ప్రైవేటు వాహనాలు... అధికారులు మౌనమా?
ప్రయాణికులను ఆకర్షిస్తూ డిపో సమీపంలోనే ప్రైవేటు వాహనాలు నిలవడం బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ, డిపో యాజమాన్యం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక–స్థానికేతర ఆపరేటర్ల మధ్య ఆధిపత్య పోరు
ప్రైవేటు వాహనాల నిర్వహణలో స్థానికులు, స్థానికేతరుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని సమాచారం. ఈ వివాదాలు కొన్ని సందర్భాల్లో పోలీసు కేసుల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. పరస్పర ఫిర్యాదులు, ఘర్షణలు తరచూ చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.
పోలీసులపై ఆరోపణలు
కొంతమంది స్థానిక వాహనదారుల ఆరోపణల ప్రకారం, స్థానికేతర ఆపరేటర్లకు ఓ పోలీసు అధికారి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సీజ్ చేసిన వాహనాలు తిరిగి రోడ్డెక్కుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
రవాణా శాఖ చర్యలు... శాశ్వత పరిష్కారం ఎక్కడ?
గుంతకల్లు రవాణా శాఖ అధికారులు పలు సందర్భాల్లో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించినప్పటికీ, అక్రమ వాణిజ్య రవాణా పూర్తిగా నియంత్రణలోకి రాలేదని స్థానికులు అంటున్నారు. తనిఖీలతో పాటు నిరంతర పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.
చట్టబద్ధమైన వాహనదారుల ఆవేదన
వేలాది రూపాయల రోడ్డు పన్నులు, బీమా, పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకుని చట్టబద్ధంగా వాహనాలు నడుపుతున్న తమకు సరైన బాడుగలు రావడం లేదని కొందరు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనధికారికంగా నడుస్తున్న వాహనాలు అధిక ఆదాయం పొందుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
కొన్ని వాహనాలకు అవసరమైన పత్రాలు, డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రయాణికులకు బీమా రక్షణ లభిస్తుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ప్రజాప్రతినిధుల జోక్యం అవసరం
ఈ అంశాన్ని బాధితులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించలేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికైనా మేల్కొనాల్సిన సమయం
ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతుండటం, ప్రైవేటు వాణిజ్య వాహనాల సంఖ్య పెరుగుతుండటం, స్థానిక–స్థానికేతరుల మధ్య వివాదాలు పెరగడం, ప్రయాణికుల భద్రతపై సందేహాలు తలెత్తడం వంటి అంశాలు ఉరవకొండలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికైనా ఆర్టీసీ, రవాణా శాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టి అక్రమ వాణిజ్య రవాణాను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ఉరవకొండ ఆర్టీసీ డిపో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
