సమస్యలు యథాతథం.. పరిష్కారం శూన్యం





 

కలెక్టర్‌కు ఫిర్యాదు.. తహసీల్దార్, ఉప తహసీల్దార్‌పై కలెక్టర్ ఆగ్రహం

ఉరవకొండ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్‌బుక్‌ల రద్దు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ తదితర అంశాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యలు యథాతథంగా కొనసాగుతున్నాయని, సంబంధిత రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉరవకొండకు చెందిన ప్రెస్ అండ్ ఆర్టీఐ జనరల్ సెక్రటరీ మీనుగ మధుబాబు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు.

ఉరవకొండ పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ను కలిసి మధుబాబు పలు ఫిర్యాదు పత్రాలు, సంబంధిత అధికారిక ఉత్తర్వుల ప్రతులను సమర్పించారు. ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్, గతంలో జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తహసీల్దార్, ఉప తహసీల్దార్‌ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం నుంచి ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుంతకల్లు, వజ్రకరూరు మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్‌బుక్‌ల రద్దు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను విచారించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, లత్త వరం గ్రామం సర్వే నెం.97-బీలోని ఎకరం 1.06 సెంట్ల ప్రభుత్వ భూమిపై జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై వివరణాత్మక నివేదిక కోరడంతో పాటు, ఉరవకొండ పట్టణ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

సమాచార హక్కు చట్టం–2005 కింద కోరిన సమాచారాన్ని పూర్తిగా ఇవ్వలేదన్న కారణంగా దాఖలైన తొలి అప్పీల్‌ను పరిశీలించిన ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ కూడా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO)కు 15 రోజుల్లో పూర్తి సమాచారాన్ని అందించి అమలు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

అయితే, ఈ ఆదేశాలు జారీ అయినప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు మధుబాబు తెలిపారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.