ఆర్బిట్ బాలికల జూనియర్ కళాశాలపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా అధికారులకు AIFDS విద్యార్థి సంఘం వినతి


 


అనంతపురం:

అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో, పశుపుల సమీపంలో నిర్వహిస్తున్న ఆర్బిట్ బాలికల జూనియర్ కళాశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని AIFDS విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు ప్రజా సమస్యల వేదికలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.


వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, గతంలో చైతన్య డిగ్రీ కళాశాల నిర్వహించిన భవనంలో ప్రస్తుతం ఆర్బిట్ బాలికల జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నారని, అయితే సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే ఒక అపార్ట్‌మెంట్ భవనంలో కళాశాల నడుస్తోందనే సమాచారం అందుతోందని తెలిపారు.


విద్యార్థినుల భద్రత, మౌలిక వసతులు, అగ్నిమాపక భద్రత, తరగతి గదుల ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల అమలు వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.


ఒకవేళ విచారణలో కళాశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లేదా అవసరమైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు తేలితే, కళాశాలను వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అక్కడ చదువుతున్న విద్యార్థినుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోకపోతే, విద్యార్థుల హక్కులు, భద్రత పరిరక్షణ కోసం AIFDS విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు హెచ్చరించారు.