ఉరవకొండ ఉపాధి హామీ ఆఫీస్‌లో అడ్మిన్ నిధుల బాగోతం!


 


ఆఫీస్ బాయ్ ఖాతాలో రూ.1.57 లక్షలు... ప్రొసీడింగ్స్ లేవు, సంతకాలు అసలే లేవు!

ఆర్టీఐ తనిఖీలో బయటపడిన బండారం.. ఉన్నతాధికారుల తనిఖీకి డిమాండ్


ఉరవకొండ, ఆగస్టు 03


ఉరవకొండ మండల ఎంపీడీఓ/ఉపాధి హామీ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ నిధుల పేరిట లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన అడ్మినిస్ట్రేషన్ బిల్లుల విత్ డ్రాల్ విషయంలో తీవ్ర అవకతవకలు జరిగాయన్న అనుమానంతో ఆర్టీఐ కార్యకర్త హెచ్. అశోక్ కుమార్ గతేడాది 15/06/2026న సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేయగా గురువారం (30/07/2026న) రికార్డుల తనిఖీకి అధికారులు అనుమతించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న మనేగర్ సలీం భాషను ఒక 'వెండర్' గా చిత్రీకరించి, బిల్లులన్నీ అతడి పేరుపైనే రూపొందించి నగదును విత్ డ్రా చేయడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సలీం భాష పేరుమీదే ఏకంగా రూ. 1,57,129/- నిధులు విత్ డ్రా చేశారు. ఒక్క విద్యుత్ (కరెంట్) బిల్లు తప్ప, మిగిలిన ఏ ఒక్క FTO (ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్) బిల్లుకూ సరైన ప్రొసీడింగ్స్ లేవు. బిల్లులు అప్రూవ్ చేయాల్సిన సంబంధిత అథారిటీ అధికారుల సంతకాలు లేకుండానే నిధులు డ్రా చేయడం అధికారుల నిర్లక్ష్యానికి, అక్రమాలకు అద్దం పడుతోంది. ఆఫీస్ నిర్వహణ పేరిట చూపిన ఖర్చులు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే! పొంతన లేని రేట్లు, దిద్దుబాట్లు ఉన్న బిల్లులతో నిధులు స్వాహా చేశారు. టీ, స్నాక్స్ (ప్రతి బుధవారం సిబ్బంది మీటింగ్స్) రూ. 45,350/-, A4 పేపర్ బండిల్స్ కొనుగోలు రూ. 33,750/-, ప్రింటర్ టోనర్ రీ-ఫిల్లింగ్ (ఒక్కదానికి రూ. 700 చొప్పున) రూ. 22,700/-, విద్యుత్ (కరెంట్) బిల్లులు రూ. 16,429/-, సిస్టమ్ రిపేర్లు & సర్వీసింగ్ రూ. 16,250/-,  ప్రింటర్ డ్రమ్ క్లీనింగ్ (ఒక్కదానికి రూ. 750 చొప్పున) రూ. 8,800/-, క్రొత్త ప్రింటర్ క్యాట్రిడ్జ్ రూ. 4,040/-, ఆఫీస్ జనరల్ స్టేషనరీ రూ. 2,680/-, తాగునీటి క్యాన్లు (క్యాన్ రూ. 20 చొప్పున) రూ. 2,400/-,  మొత్తం వెల్లడైన ఖర్చు రూ. 1,35,970/-. ఒక్క వాటర్ క్యాన్‌కు రూ. 20, టోనర్ రీఫిల్లింగ్‌కు రూ. 700, డ్రమ్ క్లీనింగ్‌కు రూ. 750 చొప్పున అడ్డగోలు వోచర్లు సృష్టించారు. బిల్లు రసీదుల్లో స్పష్టంగా దిద్దుబాట్లు (overwriting) ఉన్నప్పటికీ వాటినే ఆమోదించి నిధులు మళ్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 35,26,728/- నిధులు కేటాయించగా, అందులో రూ. 33,69,599/- సిబ్బంది జీతాలకు ఉపయోగించారు. మిగిలిన రూ. 1,57,129/- లను ఆఫీస్ బాయ్ సలీం భాష పేరుతో దారిమళ్లించారు. ప్రతి బుధవారం సిబ్బంది మీటింగ్స్ పేరుతో  విత్ డ్రా చేసిన రూ. 45,350/- రూపాయలకు ఎలాంటి బిల్లు రసీదులు లేకుండానే దారి మళ్లించారు. కనీసం నిబంధనలు పాటించకుండా, అధికారుల సంతకాలు కూడా లేకుండా ఎఫ్టీఓ బిల్లులను APO మరియు MPDOలు ఎలా అప్రూవ్ చేశారు? ఈ అక్రమాలు వారి దృష్టికి రాకుండా ఎలా జరిగాయి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇన్ని అవకతవకలు ఉంటే, గత ఆర్థిక సంవత్సరాల పరిస్థితి ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారిమళ్లింపు వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు (కలెక్టర్, డ్వామా పీడీ) వెంటనే స్పందించి, ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై మరియు సిబ్బందిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్త హెచ్. అశోక్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.