అస్సాంలో విషాదం: బ్రహ్మపుత్ర నదిలో పడి కడప విద్యార్థిని మృతి

 



గువాహటి/కడప, ఆగస్టు 2:


ఐఐటీ గువాహటిలో చదువుతున్న కడప జిల్లా విద్యార్థిని ప్రమాదవశాత్తు బ్రహ్మపుత్ర నదిలో పడి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతురాలిని జమ్మలమడుగు తహసీల్దార్ కాచన సాయినాథ్ రెడ్డి ఏకైక కుమార్తె చేతన (20) గా గుర్తించారు. ఆమె ఐఐటీ గువాహటిలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నది వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అస్సాం బయలుదేరి వెళ్లారు. 

మృతురాలి స్వగ్రామం పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి. చేతన మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.