ఉరవకొండ, ఆగస్టు 6:
ఉరవకొండ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు రేవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (RSF) అనంతపురం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు హెచ్. చిరంజీవి మాట్లాడుతూ, డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్రంగా, పారదర్శకంగా సీబీఐతో విచారణ జరిపించి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు.
అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
