గంగవరంలో దారుణం: కట్టుకున్న భార్యపై కత్తి, రోకలి బండతో భర్త దాడి

 బెలుగుప్ప (గంగవరం):అనుమానం పెనుభూతమై ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చాలని ఓ భర్త విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన బెలుగుప్ప మండలం గంగవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

​స్థానిక ఏఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన యాసిన్, భాను ఇద్దరూ భార్యాభర్తలు. గత కొంతకాలంగా భార్య భానుపై భర్త యాసిన్ తీవ్రంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆమెను ఎలాగైనా కడతేర్చాలని పక్కాగా నిర్ణయించుకున్నాడు.


తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన యాసిన్, ఇంట్లో ఉన్న కత్తితో భార్య భానును దారుణంగా పొడిచాడు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న రోకలి బండతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు రక్తపు మడుగులో కుప్పకూలింది. దాడి చేసిన అనంతరం నిందితుడు యాసిన్ అక్కడి నుంచి పరారయ్యాడు.

వెంటనే సమాచారం అందుకున్న  పోలీసులు ( ఏఎస్‌ఐ కృష్ణమూర్తి) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడు యాసిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.