పీలేరులో దారుణం: పోక్సో కేసులో కీచక ఉపాధ్యాయుడు అరెస్ట్

 పీలేరు:విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. పీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నప్పగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో యర్రప్ప అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఇద్దరు చిన్నారి విద్యార్థులతో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు బాధితుల నుండి ఫిర్యాదు అందింది.

ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, వెంటనే నిందితుడు యర్రప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు.