న్యూఢిల్లీ/కువైట్ సిటీ (ఆగస్ట్ 29): భారత్–కువైట్ మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల తొలి 'ఇండియా–కువైట్ జాయింట్ డిఫెన్స్ కమిటీ (JDC)' సమావేశం శుక్రవారం న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది.
భారత జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, కువైట్ బ్రిగేడియర్ జనరల్ రయీద్ అల్సక్రాన్ సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక సమావేశానికి అధ్యక్షత వహించారు.
సమావేశంలో చర్చించిన ప్రధానాంశాలు
- సైనిక శిక్షణ మరియు సంయుక్త విన్యాసాలు.
- మిలిటరీ మెడిసిన్ మరియు సైనిక అధికారుల మధ్య చర్చలు.
- రక్షణ పరిశ్రమ, పరిశోధన–అభివృద్ధి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడం.
2024 డిసెంబర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ సహకార అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఆ లక్ష్యాలను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. ప్రధాని మోదీ పర్యటనలోనే ఇరు దేశాల సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్య' స్థాయికి పెంచిన విషయం తెలిసిందే.
పాల్గొన్న ప్రతినిధులు:
భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తుల విభాగం, DRDO, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. కువైట్ వైపు నుండి బ్రిగేడియర్ జనరల్ రయీద్ అల్సక్రాన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం హాజరైంది.
సమావేశానికి ముందు కువైట్ ప్రతినిధి బృందం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించింది. అనంతరం భారత రక్షణ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై భవిష్యత్ సహకార అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
చారిత్రక వాణిజ్య సంబంధాలు, భౌగోళిక సమీపం, సాంస్కృతిక అనుబంధంతో పాటు కువైట్‌లో ఉన్న భారీ భారతీయ సమాజం.. ఇరు దేశాల బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు ప్రధాన ఆధారాలుగా కొనసాగుతున్నాయి.
