True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఖమ్మంలో విషాదం.. వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి

 వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ.. పరారీలో ఆర్ఎంపీ

ఖమ్మం, ఆగస్టు 10: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురైన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బాలిక జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడ ఆర్ఎంపీ బాలికకు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు తెలిపారు.

పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈసీజీ నిర్వహించి బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇంజక్షన్ ఇచ్చే సమయంలో ఆర్ఎంపీ వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన అనంతరం ఆర్ఎంపీ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాలిక మృతికి అసలు కారణం ఏమిటి? చికిత్సలో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు, వైద్యపరమైన నివేదికలు వచ్చిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

↑