కువైట్ సిటీ, ఆగస్టు 9: కువైట్‌లోని జహ్రా గవర్నరేట్ పరిధిలోని కబ్ద్ ప్రాంతంలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. ఇద్దరు విదేశీయులను హత్య చేసి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన ఈజిప్టు పౌరుడిని భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కబ్ద్ ప్రాంతంలోని ఓ పశువుల షెడ్‌లో దాడి జరిగినట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడ తీవ్ర గాయాలతో పడి ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించడంతో పాటు, హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. హత్యల అనంతరం అతను కువైట్ నుంచి భూ మార్గంలో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. రాత్కా ప్రాంతం మీదుగా సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తుండగా ల్యాండ్ బోర్డర్ సెక్యూరిటీ బలగాల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించారు. జంట హత్యలకు అసలు కారణం ఏమిటన్నదానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు ముందు నిందితుడికి, మృతులకు మధ్య ఏదైనా వివాదం ఉందా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
