ధర్మవరంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో విద్యార్థుల పోస్టర్ల ప్రదర్శన

 క్విట్ ఇండియా స్ఫూర్తితో విద్య, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి

పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు  నరేంద్రమంజుల

ధర్మవరం, ఆగస్టు 9: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో విద్య, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేయాలని పీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర పిలుపునిచ్చారు.

క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మవరం పట్టణంలో విద్యార్థులతో కలిసి పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంజుల నరేంద్ర మాట్లాడుతూ.. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ఇచ్చిన ‘చేయండి లేదా చావండి’ పిలుపు దేశ ప్రజల్లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించిందని గుర్తుచేశారు.

అదే స్ఫూర్తితో నేటి కాలంలో ప్రజాస్వామ్యం, లౌకికత, రాజ్యాంగ హక్కులు, విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం కోసం విద్యార్థులు, యువత ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. అలాగే ప్రజా రంగ సంస్థలను పరిరక్షించడం, సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విద్యార్థులు, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నించేందుకు విద్యార్థులు, యువత ముందుకు రావాలని మంజుల నరేంద్ర కోరారు. ప్రజల హక్కులకు భంగం కలిగించే విధానాలను ప్రశ్నించేందుకు ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మొండి నందకిషోర్‌తో పాటు హరి, గుణ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.