ధర్మవరం, (ట్రూ టైమ్స్ ఇండియా):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగానికి గుండెకాయ లాంటి ధర్మవరంలో చేనేత కార్మికుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ‘నేతన్న సేవ’ పథకం ప్రతి అర్హుడి గడపకు చేరేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈ పథకం అమలు తీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తాజాగా కీలక సమీక్ష నిర్వహించారు. ధర్మవరంలోని ఎన్డీయే (NDA) కార్యాలయంలో స్థానిక ఆర్డీఓ (RDO), చేనేత శాఖ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పథకం పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
అధికారులకు ప్రశ్నల వర్షం: ఈ సమీక్షా సమావేశంలో మంత్రి అధికారుల పనితీరుపై ఆరా తీశారు. ముఖ్యంగా 'నేతన్న సేవ' పథకం కింద ధర్మవరం పరిధిలో ఎంత మందికి అర్హత ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరింది? ఇంకా ఎంతమందికి ఈ సాయం అందలేదు? అని ఆయన అధికారుల నుంచి పక్కా లెక్కలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, కొందరు అర్హులకు పథకం ఎందుకు అందలేదో, అందులో సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా అధికారుల నిర్లక్ష్యం ఉందా అనే కారణాలను లోతుగా విశ్లేషించారు.
ఉన్నతస్థాయిలోచర్చలుజరిపాం.చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను ఇప్పటికే రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ గారితో పాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించిన విషయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు ఇంత సానుకూలంగా ఉన్నప్పుడు, క్షేత్రస్థాయిలో అమలులో ఎక్కడా లోపాలు ఉండకూడదన్నారు. రెవెన్యూ, చేనేత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి, ఎలాంటి అవాంతరాలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం ప్రయోజనం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్యాయం జరిగితే సహించేది లేదు!
అర్హులైన ఏ ఒక్క చేనేత కార్మికుడికి అన్యాయం జరగకూడదని, ఎక్కడైనా అర్హుడికి అన్యాయం జరిగినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఎవరినీ ఉపేక్షించేది లేదని మంత్రి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధనలో అధికారులు చిత్తశుద్ధితో, ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.

