సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్, సెప్టెంబర్ 14:కొత్తగా కొనుగోలు చేసిన కారును అడ్డుకుని అందులోని వ్యక్తి నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ట్రాన్స్‌జెండర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45లో కొత్త కారును నలుగురు ట్రాన్స్‌జెండర్లు అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కారులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల ‘ఎక్స్’లో ప్రత్యక్షమైంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. బాధితుడి నుంచి సుమారు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియోలో ఉన్న వివరాలు, డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
