రాయదుర్గంలో వర్షాభావం.. కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ డిమాండ్.

వర్షాభావంతో ఎండిపోతున్న ఖరీఫ్ పంటలు.. తీవ్ర నష్టాల్లో అన్నదాతలు

ఎకరాకు రూ.40 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి: సీపీఐ, ఏపీ రైతు సంఘం, ఏఐవైఎఫ్

రాయదుర్గం, సెప్టెంబర్ 14: వర్షాభావ పరిస్థితులతో రాయదుర్గం నియోజకవర్గంలో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సీపీఐ, ఏపీ రైతు సంఘం, ఏఐవైఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తీవ్ర వర్షాభావ ప్రాంతాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాయదుర్గం మండలంలోని ఉడేగోళం, బొమ్మక్కపల్లి, వడ్రహొన్నూరు, మారంపల్లి, ఆవులదట్లతో పాటు గుమ్మఘట్ట, హీరేహాళ్ మండలాల్లో పంటల పరిస్థితిని సోమవారం సీపీఐ, ఏపీ రైతు సంఘం, ఏఐవైఎఫ్ నాయకులు పరిశీలించారు. వర్షాలు లేక వర్షాధార పంటలు ఎండిపోవడంతో పాటు, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు బావుల కింద సాగు చేసిన పంటలు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు.

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగార్జున, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వర్షాధార పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. పంటల సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు కళ్ల ముందే పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.


రాయదుర్గం నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 47,182 హెక్టార్లలో వేరుశనగ, కంది, మిరప, ఆముదం, పత్తి, మొక్కజొన్న, కొర్ర తదితర పంటలు సాగయ్యాయని నాయకులు తెలిపారు. వర్షాభావం కారణంగా మరో 57,357 హెక్టార్ల భూమి బీడుగా మారిందని పేర్కొన్నారు.

హెచ్‌ఎల్‌సీ కింద ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్‌లో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల్లో సుమారు 50 శాతం వరకు పంటలు ఎండిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

500 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు లభించని పరిస్థితి ఉందని, భూగర్భ జలాలు అడుగంటడంతో చెరువులు, కుంటల కింద ఉన్న భూముల్లో కూడా బీటలు ఏర్పడుతున్నాయని చెప్పారు. వర్షాలు మరింత ఆలస్యమైతే ఖరీఫ్‌తో పాటు రాబోయే రబీ సీజన్‌పైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను పగటిపూట సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా అంతరాయాలకు అధికారులు తరచూ “మెయిన్ సప్లై పోయింది” అని సమాధానం చెప్పడం పరిపాటిగా మారిందని విమర్శించారు.

వర్షాభావం కారణంగా పశువులకు కూడా మేత, తాగునీటి కొరత ఏర్పడుతోందని నాయకులు తెలిపారు. వ్యవసాయాన్ని వదిలి పాడి పరిశ్రమపై ఆధారపడుతున్న రైతులు కూడా గ్రాసం కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, మేత అందుబాటులో లేకపోవడంతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని చెప్పారు.


రైతుల కోసం డిమాండ్లు


* రాయదుర్గం నియోజకవర్గంలోని తీవ్ర వర్షాభావ ప్రాంతాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలి.

* ఎండిపోయిన పంటలకు తక్షణమే నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.40,000 ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి.

* రైతుల పంట రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలి.

* వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను పగటిపూట నిరంతరాయంగా అందించాలి.

* పశువులకు అవసరమైన గ్రాసం, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి.

వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ, ఏపీ రైతు సంఘం, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కావలి కోట్రేష్, సీపీఐ, రైతు సంఘం, ఏఐవైఎఫ్ నాయకులు కృష్ణ, దినకర్, వివేక్, సుదర్శన్ రెడ్డి, ఇంద్రసేన, స్వామి, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.