ఉరవకొండ సెప్టెంబర్ 11
స్థానిక ఐసిడిఎస్ 5వ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ మాసోత్సవాలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ... సమాజంలో ప్రతి ఒక్కరూ పోషకాహార నియమాలు పాటించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు తమ దైనందిన ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు చేర్చుకోవాలని సూచించారు. చిన్న పిల్లలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు మొదటి 1000 రోజులలో అందించే పౌష్టికాహారం అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, చేతుల శుభ్రత పాటించడం ద్వారా పలు రోగాల నుండి పిల్లలను కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానికంగా లభించే పౌష్టికాహార పదార్థాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా సహాయకులు, గర్భిణులు, బాలింతలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

