బ్యాంకు రుణాలు, సీసీఆర్‌సీ కార్డులు, పంట బీమా అందించాలని డిమాండ్
వర్షాభావంతో నష్టపోతున్న కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
ఉరవకొండ, సెప్టెంబర్ 06: దేవాలయ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయడంతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది.
ఉరవకొండ మండలం పెద్దముస్తూరు గ్రామంలోని స్థానిక దేవాలయంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి. వెంకటేషులు పాల్గొని కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు వెంటనే ఈ-క్రాప్ బుకింగ్ నమోదు చేయాలని కోరారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు, సీసీఆర్‌సీ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి ప్రభుత్వ ప్రయోజనాలు కూడా కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని జిల్లాలో కౌలు రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని వెంకటేషులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర నష్టాల్లో ఉన్న కౌలు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గొర్రెలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పిల్లకాల్వల ద్వారా చెరువులను నింపాలని కోరారు. పశువుల మేత కొరతను నివారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వెంటనే గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సమావేశంలో డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎర్రమ్మ, మండల నాయకులు సుంకన్న, సీనప్ప, నాగవేణి, తిప్పమ్మ, నరసింహులు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక కౌలు రైతులు పాల్గొన్నారు.
