పెన్నహోబిలంలో కలగలపు బియ్యం, కొబ్బరి చిప్పల వేలం


 

ఉరవకొండ:

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి గానూ కలగలపు బియ్యము బేడల విక్రయ హక్కులు, కొబ్బరి చిప్పల సేకరణ హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థానం పర్యవేక్షణాధికారి కె. విజయ్ కుమార్, ఈఓ యస్. రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ రేగటి నాగరాజు, సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేలం పాటలు జరిగాయి.

రూ. 25.50కి బియ్యం బేడల పాట:

ముందుగా కార్యనిర్వహణాధికారి వేలం నిబంధనలను చదివి వినిపించగా, కలగలపు బియ్యం బేడల హక్కు కోసం నలుగురు డిపాజిట్ చెల్లించారు. వేలంలో ఇద్దరు పాల్గొనగా, అహోబిలానికి చెందిన పి. నాగశేషుడు (తండ్రి: రామసుబ్బరాయుడు) కేజీ రూ. 25.50 చొప్పున పాట పాడుకుని హక్కు దక్కించుకున్నారు. ఇది గతం కంటే కేజీకి రూ. 4.50 అధికం కావడం విశేషం.

కొబ్బరి చిప్పల వేలం వాయిదా:

అనంతరం కొబ్బరి చిప్పల సేకరణ హక్కు కోసం ముగ్గురు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. అయితే పాట రూ. 5,70,000 వద్ద ఆగిపోవడం, ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో అధికారులు ఈ వేలాన్ని వాయిదా వేశారు. కాగా, సీల్డ్ టెండర్ ద్వారా కొబ్బరి చిప్పల హక్కులకు ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదని ఈఓ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఎం. రామకృష్ణ, చంద్రమౌళి స్వామి, మంగలి నారాయణప్ప, బొల్లినేని పద్మాక్షి, ధనుంజయ ఆచారి, టీడీపీ నాయకులు మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్, బొల్లినేని ఓబులేష్, జనసేన నాయకుడు దేవేంద్ర, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు పోలీసులు పాల్గొన్నారు.