బంజారాల సమస్యలు పరిష్కరించాలి: ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు బిజిఎస్ నాయకుడు డాక్టర్ ఎస్.కె. మహేష్ నాయక్ విజ్ఞప్తి


 

ఉరవకొండ:

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని బంజారా, గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బంజారా గిరిజన సంఘం (బిజిఎస్) జాతీయ నాయకుడు డాక్టర్ ఎస్.కె. మహేష్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ నాయక్ మాట్లాడుతూ, ఉరవకొండ తాలూకాలో గిరిజన బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎస్టీ బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ప్రస్తుతం అరకొర వసతులతో నడుస్తున్న ఎస్టీ గురుకుల పాఠశాలకు పక్కా భవనం నిర్మించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లాలోని బంజారాలు ఎదుర్కొంటున్న ఇతర భూ, సామాజిక సమస్యలపై కూడా స్పందించాలని, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతులపై చైర్మన్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.