హెచ్‌ఎల్‌సీ నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయాలి
ఎండిపోతున్న పంటలు, పండ్ల తోటలను కాపాడాలని రైతుల ఆవేదన
అనంతపురం, సెప్టెంబర్ 4: హెచ్‌ఎల్‌సీ ఆయకట్టు పరిధిలోని దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని, ఎండిపోతున్న పంటలు, పండ్ల తోటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది రాజకీయ అంశం కాదని.. రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అని వారు పేర్కొంటున్నారు.
ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కొన్ని ప్రాంతాలకు నీటిని అందించే విషయాన్ని ప్రస్తావించగా, ఎంఆర్‌పీ, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు పరిధిలోని ప్రాంతాలు, చెరువులకు నీటి విడుదలపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని రైతులు చెబుతున్నారు.
దిగువ ప్రాంతాల పరిస్థితి ఏమిటి?
హెచ్‌ఎల్‌సీ దిగువన ఎంఆర్‌పీ డ్యామ్ కింద ఉన్న గార్లదిన్నె, సింగనమల, తాడిపత్రి, నార్పల, బుక్కరాయసముద్రం మండలాల్లో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉందని రైతులు అంటున్నారు. సెప్టెంబర్‌లోకి ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయని, మెట్ట ప్రాంతాల్లో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా పండ్ల తోటలకు నీరు అందకపోవడంతో వాటిని కాపాడుకోవడం రైతులకు పెద్ద భారంగా మారిందని చెబుతున్నారు. హార్టికల్చర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో తోటలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒక్కో ట్యాంకర్‌కు రూ.600
నీటి కోసం కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారని సమాచారం. ఒక్కో ట్యాంకర్‌కు సుమారు రూ.600 వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. ఒక్కసారి కాకుండా పంట చేతికొచ్చే వరకు ఇలాంటి ఖర్చు భరించడం చిన్న, సన్నకారు రైతులకు కష్టమని పేర్కొంటున్నారు.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మనుషులు, పశువులకు తాగునీటి సమస్య కూడా తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు
నీరు అందించడం ప్రభుత్వ బాధ్య
ఎండిపోతున్న పంటలు, తోటలను కాపాడేందుకు హెచ్‌ఎల్‌సీ నీటిని సక్రమంగా పంపిణీ చేసి దిగువ ప్రాంతాలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నీటిని విడుదల చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా పంటలు, తోటలను రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని కోరుతున్నారు.
రైతు పంట సాగు చేయలేకపోయినా, నీటి కొరతతో పంటలు ఎండిపోయినా అది రైతు తప్పు కాదని.. సాగునీరు అందించడంలో పాలకుల వైఫల్యమే కారణమవుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
“ఇది రాజకీయం కాదు.. రైతు బతుకు, ఈ ప్రాంత భవిష్యత్తు. హెచ్‌ఎల్‌సీ నీరు ఆయకట్టు రైతుల హక్కు. దాన్ని సక్రమంగా అందించడం ప్రభుత్వ బాధ్యత” అని రైతులు పేర్కొంటున్నారు.
నీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
