వెంకన్నకు మొక్కి.. క్యాష్ కౌంటర్‌పై కన్ను
రూ.20 వేల నగదు, వస్తువులు మాయం.. సీసీ కెమెరాల్లో ఆసక్తికర దృశ్యాలు
ఉరవకొండ, సెప్టెంబర్ 4: చోరీకి వచ్చిన ఓ వ్యక్తి ముందుగా దేవుడి చిత్రపటం ముందు చెప్పులు విడిచి నమస్కరించి, అనంతరం అదే దుకాణంలోని క్యాష్ కౌంటర్‌ను తెరిచి నగదు, వస్తువులను అపహరించిన ఘటన ఉరవకొండలో చర్చనీయాంశంగా మారింది.
ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బిగ్‌బజార్‌లో ఆగస్టు 31 అర్ధరాత్రి ఈ చోరీ జరిగినట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తి ఇనుప రాడ్డుతో షట్టర్ తాళాలను ధ్వంసం చేసి దుకాణంలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదైనట్లు తెలుస్తోంది.
దుకాణంలోకి ప్రవేశించిన అనంతరం క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లిన వ్యక్తి అక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని గమనించినట్లు సమాచారం. వెంటనే చేతిలోని ఇనుప రాడ్డును పక్కన పెట్టి, చెప్పులు విప్పి, స్వామివారి చిత్రపటం ముందు చేతులు జోడించి నమస్కరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించినట్లు తెలుస్తోంది.
కొన్ని క్షణాల అనంతరం తిరిగి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి నగదు తీసుకున్నట్లు సమాచారం. సుమారు రూ.20 వేల నగదుతో పాటు కొన్ని వస్తువులు అపహరణకు గురైనట్లు దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది
ఈ ఘటనకు నాలుగు రోజుల ముందే కూడలి ప్రాంతంలోని ఓ ఎలక్ట్రికల్ షాపులో కూడా ఇదే తరహాలో చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. షట్టర్లను ధ్వంసం చేసి దుకాణాల్లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంపై వ్యాపారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ఉరవకొండలో వరుస చోరీలు జరిగిన సందర్భాలను స్థానికులు గుర్తుచేస్తున్నారు. గతంలో పనిచేసిన ఎస్సై వెంకటస్వామి హయాంలో 36 వరుస చోరీలు జరిగినప్పటికీ వాటి పురోగతిపై స్పష్టత లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం దేవస్థానం సమీపంలోని పొలాల్లో రైతుల మోటార్లు చోరీకి గురైన ఘటనలు కూడా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. చోరీకి గురైన మోటార్ల రికవరీ విషయంలోనూ తగిన చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఉరవకొండ ప్రాంతంలో నేరాలు పెరుగుతున్నప్పటికీ చోరీ కేసుల్లో రికవరీలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. వరుస షట్టర్ చోరీలు, రైతుల మోటార్ల చోరీలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుత బిగ్‌బజార్ చోరీ కేసులో సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
