ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం పరిధిలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా లభించిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలు మంగళగిరికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆమె అక్కడ ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
మృతురాలి ఫోన్‌కు సంబంధించిన చివరి సిగ్నల్ విజయవాడలోని భవానీపురం ప్రాంతంలో నమోదైనట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆమె భవానీపురం ప్రాంతానికి ఎలా వెళ్లింది? అక్కడ ఎవరిని కలిసింది? అనంతరం ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వరకు మృతదేహం ఎలా చేరింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. భవానీపురానికి చెందిన షఫీ అనే వ్యక్తితో మృతురాలు కళ్యాణికి పరిచయం ఉన్నట్లు, ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. కళ్యాణి తరచూ డబ్బులు అడిగేదని, డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 17న రూ.20 వేలు డిమాండ్ చేసిన నేపథ్యంలో షఫీ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లినట్లు, అక్కడే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, బ్యాగుల్లో పెట్టి కూలింగ్ కెనాల్‌లో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి పూర్తి స్థాయి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. తొలుత కూలింగ్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళకు చెందిన మొండెం, తల, కాళ్లు, చేతులు లభించాయి. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి మృతురాలి గుర్తింపు కూడా నిర్ధారణ కాలేదు.
ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ, ఫోన్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు మృతురాలు ఎక్కడెక్కడికి వెళ్లింది, ఎవరెవరితో మాట్లాడింది, ఆమెతో చివరిగా ఎవరు ఉన్నారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
మృతురాలి హత్యకు గల అసలు కారణం, నిందితుల పాత్ర, మృతదేహాన్ని కెనాల్‌లో పడేసిన విధానం వంటి అంశాలు పోలీసుల పూర్తి దర్యాప్తులో తేలాల్సి ఉంది.
