గంజాయి సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1,500 రివార్డు!

డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే రూ.5 వేల బహుమతి

ఎన్టీఆర్ జిల్లాలో ‘ఈగల్ ఛాలెంజ్’ ప్రారంభం

విజయవాడ, సెప్టెంబర్ 4: మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ఈగల్ ఛాలెంజ్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గంజాయి సేవించే వారి సమాచారం అందించిన వారికి రూ.1,500 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రకటించారు.
అదేవిధంగా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 రివార్డు అందజేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ బృందాలు కూడా పోలీసులతో కలిసి పనిచేయనున్నాయి.
మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,287 మందిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాలపై నిఘాను మరింత పెంచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు దళారులు, వ్యాపారులు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై నిఘా పెంచనున్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉద్యోగం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు.
మత్తు రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.