రాయలచెరువు పీహెచ్‌సీలో ABHA–EHR పైలట్ ప్రాజెక్టుపై సమీక్ష

రాయలచెరువు పీహెచ్‌సీలో వైద్య సేవల పరిశీలన.. డిజిటల్ ఆరోగ్య రికార్డులపై సమీక్ష

రాయలచెరువు, సెప్టెంబర్ 5: సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు శనివారం రాయలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.

రాయలచెరువు పీహెచ్‌సీలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్యక్రమం ద్వారా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (EHR) అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టు పురోగతిని డాక్టర్ దేవరాజన్, డాక్టర్ అప్పయ్యలతో కలిసి సమీక్షించారు.

పౌరుల నమోదు ప్రక్రియ, వారి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేయడం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.

డిజిటల్ ఆరోగ్య సేవలపై దృష్టి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో డిజిటల్ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, పైలట్ ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేయడం వంటి అంశాలపై వైద్య, ఆరోగ్య సిబ్బందితో జిల్లా వైద్యాధికారి చర్చించారు.

అనంతరం ఆసుపత్రి వార్డును పరిశీలించిన డాక్టర్ వెంకటేశ్వర్లు చికిత్స పొందుతున్న బాలింతను కలిసి ఆమెకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ల్యాబ్‌లోని రికార్డులు, మందుల నిల్వలు, సంబంధిత రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా విధులు నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మనోజ్ కుమార్ (అనంతపురం), డాక్టర్ దేవరాజన్, డాక్టర్ అప్పయ్యతో పాటు రాయలచెరువు పీహెచ్‌సీ వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.