జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు సాధారణ తనిఖీ
డిజిటల్ ఆరోగ్య రికార్డులు, వైద్య సేవలపై పరిశీలన
యాడికి, సెప్టెంబర్ 06: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు సాధారణ తనిఖీల్లో భాగంగా యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
యాడికి పీహెచ్‌సీలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) ద్వారా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (EHR) అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టు పురోగతిని వైద్యాధికారులు డాక్టర్ పరమేశ్వర్, డాక్టర్ సాయి సుమంత్ రెడ్డిలతో కలిసి సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో డిజిటల్ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.డిజిటల్ రికార్డుల పరిశీలన
పౌరుల నమోదు, రోగుల వైద్య చరిత్ర, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ రికార్డుల్లో నమోదు చేస్తున్న విధానాన్ని జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ ఆరోగ్య రికార్డుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
వార్డు, ల్యాబ్‌లో తనిఖీ
అనంతరం ఆసుపత్రి వార్డును పరిశీలించిన డాక్టర్ వెంకటేశ్వర్లు చికిత్స పొందుతున్న బాలింతను పరామర్శించి, ఆమెకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై ఆరా తీశారు.
ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన రికార్డులను, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వైద్య సేవల్లో నాణ్యతను కొనసాగించాలని సిబ్బందికి సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఇన్‌చార్జ్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మనోజ్ కుమార్, వైద్యాధికారులు డాక్టర్ పరమేశ్వర్, డాక్టర్ సాయి సుమంత్ రెడ్డితో పాటు సీహెచ్‌సీ, పీహెచ్‌సీ వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
