రాయదుర్గంలో ధరల పెరుగుదలపై సీపీఐ ధర్నా.. నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్

 ధరల పెరుగుదలను అరికట్టాలి.. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి: సీపీఐ

రాయదుర్గం, సెప్టెంబర్ 9: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ధర్నా నిర్వహించారు. అనంతరం రాయదుర్గం తహసీల్దార్‌కు పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ రాయదుర్గం నియోజకవర్గ కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ.. 2014 నుంచి 2026 వరకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఆరోపించారు. బియ్యం, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, వంటనూనె, పాలు, చక్కెర, ఉప్పు, కూరగాయల ధరలు పెరగడంతో పేద, కార్మిక, రైతు, చిరు వ్యాపారి, మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం పడుతోందన్నారు.

రైతులకు పంటలకు తగిన ధర లభించకపోగా, మార్కెట్‌లో వినియోగదారులు అధిక ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తోందని నాగార్జున పేర్కొన్నారు. దళారీ వ్యవస్థ, అక్రమ నిల్వలు, నల్లబజారు, కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు, వ్యవసాయ పెట్టుబడులు పెరిగి చివరకు నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతోందన్నారు. వంటగ్యాస్ ధరలను కూడా తగ్గించాలని కోరారు.

నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఏఐవైఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కావలి కోట్రేష్, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి తిప్పేస్వామి, రాయదుర్గం పట్టణ కార్యదర్శి రవీంద్రనాథ్, సీపీఐ మండల ఇన్‌చార్జి దుర్గన్న, నాయకులు అంజప్ప, అజయ్, మంజు, అశోక్, సిద్ధ, మరెన్న తదితరులు పాల్గొన్నారు.