జల నిర్వహణ వైఫల్యాన్ని ఎల్ నినో పై నెట్టి వేస్తున్న కూటమి ప్రభుత్వం! కేవీ రమణ

 


శ్రీశైలం నీటిని కాపాడండి, రాయలసీమ దప్పిక తీర్చండి!


ఉరవకొండ సెప్టెంబర్ 10:

      కూటమి ప్రభుత్వం ఒకవైపు జల నిర్వహణ చేతకాక,మరోవైపు పక్షపాత బుద్ధితో,నేరం ఎల్ నినో పై నెట్టివేసి చేతులు దులుపు కుంటున్నది.

     త్రాగునీటికే తొలి ప్రాధాన్యత అంటున్న ఈ ప్రభుత్వం,శ్రీశైలం నుంచి నీరు కిందికి వెళుతుంటే కల్లప్పగించి చూస్తున్నది.

    కృష్ణా డెల్టా ఆకలిని గురించి మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం,రాయలసీమ దప్పిక గురించి మాట్లాడటం లేదు.

    తీవ్రమైన ఎల్‌ నినో పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన లేక,జల నిర్వహణను సరైన ప్రాధాన్యతలతో చేపట్టడం లేదు.

     రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యత త్రాగునీటికి,ఆ తర్వాత సాగునీటికి,ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తికి ఇవ్వాలి.ఈ సూత్రాలకు అనుగుణంగానే కృష్ణా నది యాజమాన్య బోర్డు కూడా రెండు రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేసింది.

     ఈ నేపథ్యంలో అక్టోబర్ వరకు కృష్ణా జలాలు నాగార్జునసాగర్ ద్వారా కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాల అవసరాలకు ఆంధ్రప్రదేశ్ కు సుమారు 14 టీఎంసీలు,తెలంగాణలోని నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు సుమారు 7 టిఎంసిలు మొత్తం21 టీఎంసీలు అవసరం, అయితే ఆగస్టు రెండో వారానికే శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు రెట్టింపు నీటిని తరలించారు.అధికారిక లెక్కల ప్రకారం సెప్టెంబర్ 9 నాటికి శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ సుమారు 67.53 టీఎంసీలు,కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ 11.13 టీఎంసీలు మొత్తంగా 78.66 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి దిగువకు తరలించేసారు.

     నీటి కొరత తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తరలించడం,ఆ నీటిని కూడా మనమే వాడుకుంటాము కదా అని జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడడం ఈ ప్రభుత్వ అస్తవ్యస్త జల నిర్వహణకు అద్దం పట్టడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల ప్రజల హక్కులను హరించి వేసింది.

     శ్రీశైలం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సందర్భంలో బచావత్ ట్రిబ్యునల్ నిర్దేశించిన ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు రూపకల్పనలో 854 అడుగుల కనీస నీటిమట్టం కీలకమైన అంశం.దీని ప్రకారం కేవలం నాగార్జునసాగర్,కృష్ణా డెల్టా ఆయకట్టుకు కేటాయించిన నీటిని మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలి.

    కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా మళ్ళిస్తే,కేవలం నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఇచ్చే నీటితో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. 

    రాష్ట్ర విభజనకు ముందు నిర్మాణంలో ఉన్న తెలుగుగంగ,గాలేరు-నగరి, హంద్రీ-నీవా,వెలుగొండ, ఎస్‌ఎల్‌బీసీ,కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం నీటి హక్కులు కల్పించింది.

కాబట్టి శ్రీశైలం జలాశయంలోకి వచ్చే ప్రతి నీటి ప్రవాహాన్ని కేవలం దిగువకు తరలించే దృక్పథంతో కాకుండా, శ్రీశైలం ఎగువన ఆధారపడిన ప్రాంతాల నీటి భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

    ఈ సంవత్సరం తీవ్రమైన ఎల్‌నినో పరిస్థితుల్లో

సాగునీటికి కావలసినంత నీరు అందుబాటులో లేని కారణంగా త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తరలించడాన్ని ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించకూడదు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు ముందు బలంగా వినిపించాలి.అక్కడ పరిష్కారం లభించకపోతే కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లాలి.అవసరమైతే కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్లి త్రాగునీటి భద్రతను కాపాడాలి.

     గత ఏడాది శ్రీశైలం జలాశయానికి 2,259 టీఎంసీలు వచ్చాయి 

అయినా ఎందుకు ఖాళీ అయ్యింది?ఈరోజు ఏర్పడిన సంక్షోభానికి గత ఏడాది జరిగిన జల నిర్వహణ లోపాలు కూడా కారణమే.అంత భారీగా నీరు వచ్చిన సంవత్సరంలో శ్రీశైలంలో కనీస నీటి మట్టమైన 854 అడుగులకు సమానమైన సుమారు 90 టీఎంసీల నిల్వతో పాటు ట్రిబ్యునల్ నిర్దేశించిన విధంగా 60 టీఎంసీల క్యారీ ఓవర్ నిర్వహించి ఉంటే, సుమారు 150 టీఎంసీలు గత సంవత్సర నీరు ఈ సంవత్సరం కూడా శ్రీశైలంలో నిల్వ ఉండేది.అంటే నీటిమట్టం సుమారు 870 అడుగుల స్థాయిలో ఉండే అవకాశం ఉండేది.కానీ జల నిర్వహణ లోపం వల్ల కేవలం 39 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది.

       ట్రిబ్యునల్ నిర్దేశించినట్టుగా గత సంవత్సరం క్యారీ ఓవర్‌గా శ్రీశైలం జలాశయంలో 150 టీఎంసీలు నిల్వ చేసి ఉంటే,ఈ సంవత్సరం శ్రీశైలం జలాశయానికి వచ్చిన 213.22 టి ఎం సి నీటి లభ్యతతో కలిపి మొత్తం 414 టీఎంసీల నీరు రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకునే అవకాశం ఉండేది.

      ప్రభుత్వం జల సంరక్షణ సరిగా చేపట్టక పోవడం వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రజలతో పాటు ప్రకాశం,నెల్లూరు జిల్లాల సాగునీటి భద్రతను కూడా దెబ్బ తీస్తున్నది.

    అదేవిధంగా తుంగభద్ర దిగువ కాలువ,తుంగభద్ర ఎగువ కాలువ, ఎస్‌ఆర్‌బీసీ,కేసీ కెనాల్ వంటి చట్టబద్ధ హక్కులున్న ప్రాజెక్టులతో పాటు,రాష్ట్ర పునర్విభజన చట్టం హక్కులు కల్పించిన గాలేరు-నగరి,హంద్రీ-నీవా, తెలుగుగంగ,రాయలసీమ ఎత్తిపోతల,హంద్రీ--నీవా గాలేరు-నగరి అనుసంధానం వంటి ప్రాజెక్టులలో కీలక నిర్మాణాలు పూర్తికాకపోవడం వల్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పరిమితమైంది.

    అంతేకాకుండా పంట కాలువల నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల అనేక ప్రాజెక్టుల ఆయకట్టులలో సుమారు 65 శాతం భూమికి సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది.

    కృష్ణా డెల్టా పంటలకు నీరు అందించాలని ఆ ప్రాంతం రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తే,ఈ ప్రభుత్వం పట్టిసీమ నుంచి గోదావరి జలాలు,పులిచింతల నుంచి కృష్ణా జలాలు, అందుబాటులో ఉన్నప్పటికీ,మరలా శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను కూడా కృష్ణా డెల్టా వరి పంటలను రక్షించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఇండెంట్ ఇచ్చింది.

కానీ రాయలసీమలో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నా,ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వమని ఖరాకండిగా చెబుతున్నది.మరి అదే స్థాయిలో రాయలసీమ ప్రజలు తిరుగుబాటు చేయాలి కదా?

    కృష్ణా డెల్టా ప్రజల ఆకలి పై స్పందించే ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజల దప్పిక గురించి ఎందుకు స్పందించదు?ఇది ప్రాంతీయ అసమానతలను పెంచడం,ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా?

    శ్రీశైలం నీటిని కాపాడండి రాయల సీమ దప్పిక తీర్చండని కేవి రమణ కోరారు.