రాయదుర్గంలో 111 మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

 రాయదుర్గం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ స్వధర్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 111 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని, అనంతరం సహజ పద్ధతిలో నిమజ్జనం చేయాలని ట్రస్ట్ ప్రతినిధులు ప్రజలకు సూచించారు.

మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వారు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాల వల్ల నదులు, చెరువులు, ఇతర నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల పర్యావరణహితమైన మట్టి వినాయకులను ప్రోత్సహించాలని కోరారు.

కార్యక్రమంలో భాగంగా రాయదుర్గంలోని దశభుజ గణపతి దేవాలయానికి 11 మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. స్వధర్మ సేవా ట్రస్ట్ కార్యాలయంలో 30 మంది చిన్నారులకు, కోతిగుట్ట వీధుల్లో 15 మంది మహిళలకు, ఐటీఐ కళాశాల, జెరెస్ కాలనీ ప్రాంతాల్లో 20 మంది చిన్నారులకు, శాంతినగర్‌లోని గుడారాల్లో నివసిస్తున్న కుటుంబాలకు చెందిన చిన్నారుల ద్వారా వారి తల్లిదండ్రులకు 21 విగ్రహాలను పంపిణీ చేశారు.

‘భక్తి కూడా – ప్రకృతి రక్షణ కూడా’ అనే సందేశాన్ని చిన్నారుల ద్వారా వారి తల్లిదండ్రుల్లోకి తీసుకెళ్లాలనే ప్రత్యేక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. “మట్టి వినాయకుడు – మన సంప్రదాయానికి ప్రతీక, పర్యావరణ పరిరక్షణకు మార్గదర్శి” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

భక్తి, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంపొందించేందుకు దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు.



ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండి యశస్వి, స్వధర్మ సేవా ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రో డైరెక్టర్ కలుగోడు మనోజ్ కుమార్, ట్రెజరర్ వై. గంగాధర్, ట్రస్టీలు వై. మహేష్, గౌస్ పీర్, ఎస్‌ఎస్‌సీటీ రాయదుర్గం జనరల్ సెక్రటరీ-1 ఎం. రామాంజనేయులు, జాయింట్ సెక్రటరీ-2 మురళీకృష్ణ, ఈసీ సభ్యులు ఎం. మహేష్, ప్రణీత, రమేష్, రామాంజి, వంశీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.