శ్రీకాకుళం ముంపు ప్రాంతాల్లో పిసిని చంద్రమోహన్ పర్యటన.. పంట నష్టంపై పరిశీలన


 శ్రీకాకుళం, సెప్టెంబర్ 26: శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ శుక్ర, శనివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముంపు పరిస్థితులను పరిశీలించడంతో పాటు ఆయా గ్రామాల్లో రైతులు, ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో ముంపునకు గురైన శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. కిల్లిపాలెం, పొన్నాడ ప్రాంతాలతో పాటు బూర్జ మండలంలోని అల్లేన, నీలాదేవిపురం, పనుకుపర్తి, లక్కుపురం గ్రామాల్లో పర్యటించి ముంపు పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు, రైతులతో మాట్లాడిన పిసిని చంద్రమోహన్ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముంపు కారణంగా పంట పొలాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేసుకున్నారు.

ముంపు ప్రాంతాల్లో పరిస్థితులపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్‌తో పిసిని చంద్రమోహన్ ఫోన్‌లో మాట్లాడినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక, నివారణ చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నాయి.

తుఫాన్ ప్రభావంతో జరిగిన పంట నష్టం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్ర నివేదికను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి అందజేస్తామని పిసిని చంద్రమోహన్ తెలిపారు. ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ పర్యటనలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా నాయకులు కొబగాపు గౌతమ్, చిట్టి భాస్కర్, పాకల కిషోర్, మత్స బుచ్చిబాబు, మురళీధర్ తదితరులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు.