కేటీ దొడ్డిలో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
కేటీ దొడ్డి, సెప్టెంబర్ 26: జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలంలో ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కార్యక్రమంలో నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కూలీలు ఏకమై రైతాంగానికి సంబంధించిన సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాలు రైతాంగానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని, వ్యవసాయ రంగాన్ని రక్షిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు అనంతరం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయ విధానాలను రూపొందిస్తున్నాయని ఆరోపించారు.
కొత్త వ్యవసాయ రంగ చట్టాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొత్త యాప్‌లను తీసుకురావడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయని, సకాలంలో ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్ట బిల్లు, నూతన అటవీ హక్కుల నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు కార్తీక్ తెలిపారు. ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభలకు రైతులు, కూలీలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నర్సింలు, వీరన్న, రంగస్వామి, తాయప్ప, మారిన కర్రన్న, నర్సింలు, ఎల్లప్ప, మాదన్న, రవికుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
