ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో అవకాశం
అమరావతి, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్లో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను ‘నిధి’ పోర్టల్ ద్వారా సమర్పించే గడువును డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.
సాంకేతిక సమస్యల కారణంగా గతంలో నిర్ణయించిన గడువులోపు కొంతమంది అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించలేకపోయినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో అవకాశం కల్పించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.
అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులు కొత్త గడువును సద్వినియోగం చేసుకుని ‘నిధి’ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి వాడ్రేవు వినయ్ చంద్ సూచించారు.
క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకుని గడువు ముగిసేలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ఈ గడువు పొడిగింపుతో సాంకేతిక కారణాల వల్ల గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో అవకాశం లభించినట్లయింది.

