True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. 400 కిలోల రాగి వైర్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్


 ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. 400 కిలోల రాగి వైర్ స్వాధీనం

కళ్యాణదుర్గం, అక్టోబర్ 7: రైతుల పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్లను చోరీ చేస్తున్నారనే కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 400 కిలోల రాగి వైర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కళ్యాణదుర్గం పోలీస్ డివిజన్ పరిధిలోని కనేకల్, కళ్యాణదుర్గం, బెలుగుప్ప, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల్లో రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్లను ఎత్తుకెళ్లినట్లు పలు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులను ఛేదించేందుకు కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంటేశ్వర్, కంబదూరు ఎస్‌ఐ లోకేష్ కుమార్‌ను ప్రత్యేక బృందంగా నియమించినట్లు వెల్లడించారు. ఐదు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా నిందితుల కదలికలపై నిఘా ఉంచి ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అరెస్టు చేసిన నిందితుల నుంచి 400 కిలోల రాగి వైర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేయడంతో రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు.

కళ్యాణదుర్గం డీఎస్పీ దైవ ప్రసాద్ సమక్షంలో బుధవారం నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించారు.

కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ నీలకంటేశ్వర్, కంబదూరు ఎస్‌ఐ లోకేష్ కుమార్‌తో పాటు కానిస్టేబుల్ పవన్‌ను డీఎస్పీ దైవ ప్రసాద్ అభినందించారు.

కంబదూరు మండలంలో ఎస్‌ఐగా లోకేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై స్థానికంగా ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నట్లు తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం, రాగి వైర్ల చోరీకి సంబంధించి మరిన్ని కేసులతో నిందితులకు సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

↑