నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు గండి: భారీగా వృథా అవుతున్న తుంగభద్ర జలాలు

 


ఉరవకొండ:

ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామంలోని సమ్మర్ స్టోరేజ్ (ఎస్‌ఎస్‌) ట్యాంక్‌కు గండి పడటంతో తాగునీరు భారీగా వృథాగా పోతోంది. పక్కా ప్రణాళికతో శ్రమించి తుంగభద్ర జలాలను ఈ చెరువులోకి మళ్లించి నింపగా, ఇప్పుడు లీకేజీ ఏర్పడి నీరంతా వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ నీటి నిల్వలు తగ్గిపోతే రాబోయే రోజుల్లో ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

వైసీపీ నాయకుల పరిశీలన – తక్షణ చర్యలకు డిమాండ్

చెరువు లీకేజీ ప్రదేశాన్ని వైఎస్సార్‌‌సీపీ నాయకులు పరిశీలించారు. ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, యుద్ధప్రాతిపదికన గండిని పూడ్చే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

గత ఏడాది కూడా ఇదే తరహాలో లీకేజీ ఏర్పడటంతో రైతులు జిల్లా కలెక్టర్‌కు విన్నవించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. వర్షాభావ పరిస్థితుల్లో లభించిన అమూల్యమైన తుంగభద్ర జలాలు ఇలా కళ్లముందే వృథా కావడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అశోక్ కుమార్, యోగేంద్ర రెడ్డి, ఉరవకొండ రూరల్ అధ్యక్షుడు ఎర్రీస్వామీ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు డిష్ సురేష్, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్, శివరాజ్, అంజి తదితరులు పాల్గొన్నారు.