గవి మఠ హెచ్చరిక బోర్డు తూచ్..అక్రమoగా సాగుతోందోచ్...


 


ఉరవకొండ: ఆధ్యాత్మిక నిలయం, వేలాది మంది భక్తుల నమ్మకానికి ప్రతీక అయిన ఉరవకొండ శ్రీ గవిమఠం సంస్థానానికి చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, కుమ్మక్కు ఆరోపణల నడుమ మఠం భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తుండటంతో భక్తుల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

చేల్గురి ప్రధాన రహదారి సమీపంలో జగద్గురు కరిబసవ రాజేంద్ర స్వామి పేరిట ఉన్న 22.40 ఎకరాల విలువైన మఠం భూమిని కొందరు అక్రమంగా బదిలీలు, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడమే కాకుండా, యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రికార్డుల తారుమారు – అధికారే సూత్రధారి?

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్వామివారి పేరిట ఉన్న 22.40 ఎకరాల విస్తీర్ణాన్ని ఐదు విభాగాలుగా విభజించి, పలువురి పేర్ల మీదకు మార్చేశారు. ఈ అక్రమాల్లో నాటి దేవాదాయ శాఖ అధికారి ఓ. మల్లికార్జున కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉండటం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. అయితే, ఈ దందాను నిగ్గు తేల్చేందుకు సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులపై నిష్పాక్షిక విచారణ జరగాల్సి ఉంది.

హెచ్చరిక బోర్డుకే పరిమితమైన చట్టాలు

మఠం ఆస్తుల పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ చట్టం (30/87) నిబంధనలు ఇక్కడ మట్టిలో కలిసిపోయాయి. అధికారులు నామమాత్రంగా ఒక హెచ్చరిక బోర్డు పాతేసి చేతులు దులుపుకున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో అక్రమ సాగును అడ్డుకోలేకపోయారు. పలుమార్లు బహిరంగ వేలం వేస్తామని ప్రకటించినప్పటికీ, ఏవో నెపాలు చూపుతూ ప్రక్రియను వాయిదా వేయడం వెనుక పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

లోకాయుక్త జోక్యంతో కదలిక.. అయినా శూన్యం

సామాజిక కార్యకర్త మీనుగ మధుబాబు సుదీర్ఘ పోరాటం చేసి లోకాయుక్తను ఆశ్రయించడంతోనే ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లోకాయుక్త ఆదేశాల మేరకు విచారణలు, అధికారులపై చర్యల ప్రతిపాదనలు వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. గతంలో 4.48 ఎకరాలకు వేలం నిర్వహించేందుకు ప్రయత్నించినా అది అర్ధాంతరంగా నిలిచిపోగా, ఆ తర్వాత వచ్చిన అధికారులు కూడా బోర్డుల మార్పిడికే పరిమితమయ్యారు.

భక్తుల ముఖ్య డిమాండ్లు:

 * సగ్ర విచారణ: 22.40 ఎకరాల భూవ్యవహారంపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలి.

 * రికార్డుల ప్రక్షాళన: మఠం భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి.

 * అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు: చట్టవిరుద్ధంగా జరిగిన బదిలీలను తక్షణమే రద్దు చేసి, ఆ భూములను తిరిగి గవిమఠానికి స్వాధీనం చేయాలి.

 * చట్టపరమైన చర్యలు: హెచ్చరిక బోర్డులను సైతం లెక్కచేయకుండా సాగు చేస్తున్న అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

 * ఆదాయ రికవరీ: ఇన్నాళ్లుగా మఠం భూముల నుండి అక్రమంగా పొందిన పంట రాబడిని లెక్కించి, అక్రమార్కుల నుండి రికవరీ చేయాలి.

 * కఠిన శిక్షలు: స్వామివారి ఆస్తులను కొల్లగొట్టేందుకు సహకరించిన అధికారులు, వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలి.

"మఠం ఆస్తులు అంటే కేవలం మట్టి కాదు.. అది లక్షలాది మంది భక్తుల విశ్వాసం. ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి మఠం భూములను కాపాడాలి" అని భక్తజనం నినదిస్తోంది.