True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

చాబాల MPP పాఠశాలను పరిశీలించిన SMC చైర్మన్ ఆకుల వెంకటేశులు

చాబాల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్‌ఎంసీ చైర్మన్

మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థుల హాజరుపై పరిశీలన

వజ్రకరూరు: మండల పరిధిలోని చాబాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్ ఆకుల వెంకటేశులు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు.

ముందుగా విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన ఆయన, పాఠశాలలో విద్యార్థుల హాజరు మెరుగుపడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి దాని నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

పాఠశాలలో విద్యాబోధన తీరు, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎంసీ చైర్మన్ ఆకుల వెంకటేశులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రాజేష్, ఉపాధ్యాయులు దేవేంద్ర, మేటి శ్రీధర్, కమిటీ సభ్యుడు తలారి చెన్నప్ప, ఇతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

↑