True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఉరవకొండలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు


 

ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా):

స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) వేడుకలను ఉరవకొండ పట్టణంలోని స్థానిక అనంతపురం బైపాస్ రోడ్డులో ఉన్న మదరసాలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సీనియర్ ఎలెక్ట్రిషన్ ఉక్కిసుల గోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆజాద్ జీవిత విశేషాలను, దేశ విద్యారంగానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.

మౌలానా ఆజాద్ జీవిత విశేషాలు:

 * జననం & బాల్యం: మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబరు 11న మక్కాలో జన్మించారు. ఆయన తల్లి అరబ్ మహిళ కాగా, తండ్రి బెంగాలీ ముస్లిం పండితుడు. తల్లిదండ్రులు ఆయనకు మొహియుద్దీన్ అహ్మద్ (ఫిరోజ్ బఖ్త్) అని పేరు పెట్టారు. 1890లో వీరి కుటుంబం కలకత్తా వచ్చి స్థిరపడింది.

 * విద్యాభ్యాసం & ప్రతిభ: ప్రాథమిక విద్యను ఇంట్లోనే అభ్యసించి అరబిక్, పర్షియన్, ఉర్దూ, మతపరమైన అంశాలు, గణితం, యునానీ వంటి విద్యలలో నైపుణ్యం సాధించారు. అసాధారణమైన జ్ఞాపకశక్తి కలిగిన ఆయన 12వ ఏటనే గ్రంథాలయం, పఠనాలయం, వక్తృత్వ సంఘాన్ని ప్రారంభించి నిర్వహించారు. 1904లో (16వ ఏట) జాతీయ స్థాయి సమ్మేళనంలో అనర్గళంగా ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 * మత సామరస్యం & స్వాతంత్ర్య పోరాటం: "స్వరాజ్యం ఆలస్యమైతే భారత్‌కే నష్టం, కానీ హిందూ-ముస్లిం ఐక్యత భగ్నమైతే అది మానవాళికే తీరని లోటు" అని నమ్మిన గొప్ప దేశభక్తుడు ఆజాద్. 1921 సహాయ నిరాకరణ, 1930 శాసనోల్లంఘన, 1942 క్విట్ ఇండియా ఉద్యమాలలో క్రియాశీల పాత్ర పోషించారు. 1923, 1940-46 కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. దేశ విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

 * విద్యాశాఖ మంత్రిగా సేవలు: 1947 నుండి 1952 వరకు తొలి విద్యాశాఖ మంత్రిగా, 1952 నుండి 1958 వరకు విద్యా, సహజ వనరుల పరిశోధన మరియు శాస్త్రసాంకేతిక శాఖల మంత్రిగా, 1956లో యునెస్కో (UNESCO) అధ్యక్షుడిగా దేశంలో విద్యాభివృద్ధికి బలమైన పునాదులు వేశారు.

 * గుర్తింపు & పురస్కారాలు: ఆయన జ్ఞాపకార్థం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008 సెప్టెంబరు 11న ఆయన పుట్టినరోజును (నవంబరు 11) 'జాతీయ విద్యా దినోత్సవం'గా ప్రకటించింది. ఇదే రోజును జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం 'భారతరత్న' పురస్కారాన్ని అందజేసింది.

ఈ వేడుకల్లో మదరసా నిర్వాహకులు అబ్దుల్ ఘనీ, సామాజిక కార్యకర్తలు నిరంజన్ గౌడ్, వన్నూర్ సాబ్, లెనిన్ బాబు, జమీల్, పోసా రాము, ఇర్ఫాన్లతో పాటు అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


↑