వివిధ రాజకీయ పార్టీలకు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి
ఉరవకొండ:ట్రూ టైమ్స్ ఇండియా నవంబర్ 18: ఉరవకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి చేనేత సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ (ఏఐడబ్ల్యూఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి చంగల మహేష్ వివిధ రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు బుధవారం టీడీపీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరవకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించబడిందని, గ్రామంలో చేనేత కుటుంబాల జనాభా గణనీయంగా ఉందని తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉరవకొండ గ్రామ పంచాయతీకి, చేనేత సామాజిక వర్గానికి విడదీయలేని అనుబంధం ఉందని, 'ఉరవకొండ గ్రామ పంచాయతీ అంటే నేసే వాళ్లది' అనే నానుడి ఉందని గుర్తుచేశారు. చేనేత కార్మికుల సమస్యలు, వారి అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించేలా రాజకీయ పార్టీలు ఆలోచించాలని కోరారు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ అభ్యర్థిగా చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేశారు.

