ఉరవకొండలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఉరవకొండ, ట్రూ టైమ్స్న ఇండియా వంబర్ 16:గ్రంథాలయ ఉద్యమ పితామహులు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం తదితర మహనీయుల సేవలు చిరస్మరణీయమని గ్రంథాలయాధికారి ప్రతాపరెడ్డి కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ, అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం స్థానిక ఉరవకొండ శాఖ గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గ్రంథాలయాధికారి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాల వ్యాప్తికి మహనీయులు చేసిన త్యాగాలను, విశేష సేవలను విద్యార్థులకు వివరించారు. నేటి తరం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, విజ్ఞానాన్ని పెంపొందించుకుని అభివృద్ధి పథంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

