--------------------------
చెప్పేవాడికి వినేవాడు లోకువ,నెత్తి మీద నీటిని గడ్డం కిందికి తేలేని వాడు గోదావరి నుండి బనకచర్లకు తెస్తాడట.
అత్యంత కరువు పీడిత ప్రాంతాలైన అనంతపురం,కడప జిల్లాలకు ప్రాణప్రదమైన తుంగభద్ర హెచ్ ఎల్ సి కి ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో టీబీ డ్యాంలో 108 టీఎంసీలే లభ్యమవుతాయని అంచనా కట్టి,అందులో దామాషా
(ప్రోరేట్) ప్రకారం అధికారికంగా 16.557 టీఎంసిలు కేటాయించారు.
ఆగస్టు 5న హెచ్ఎల్సీ కి నీటిని విడుదల చేశారు. నేటికీ 97 రోజులు ప్రవాహం సాగితే,కేవలం 11.847 టీఎంసిలు మాత్రమే వచ్చాయి.ఇంకా 3.71 టీఎంసీలు రావాల్సి ఉంది. రోజుకు సగటున ఇప్పుడు వస్తున్న ప్రకారం 1500 క్యూసెక్కులతో లెక్కిస్తే ఈ నెలాఖరుకు 2.5 టిఎంసి లే వస్తాయి.తుంగభద్ర డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వల ఆధారంగా పూర్తిస్థాయిలో తీసుకోవడం కష్టం.
ఒక వైపు తుంగభద్ర బోర్డు అధికారులు ప్రవాహం పెంచడాన్ని పట్టించుకోవడం లేదు.రెండవ వైపు డ్యామ్ లో నీటి నిల్వ అమాంతం తగ్గిపోయి,డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నది.ఫలితంగా ఐఏ బి లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి హామీ మేరకు హెచ్ ఎల్ సి మొదటి దశలో పంటలు వేసుకున్న రైతులలో ఆందోళన మొదలైంది, చివరికి తాగడానికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు దాపురించాయి.ఈలోపు మనకు రావాల్సిన మిగిలిన నీటి వాటాను తీసుకోవడం అసాధ్యం.
దీనిని బట్టి ఎల్ నినో పరిస్థితుల్లో అరకొరగా వచ్చే హెచ్ ఎల్ సి జలాలను సకాలంలో తీసుకురావడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
తుంగభద్ర డ్యామ్ లో ప్రస్తుతం 33.83 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి.కాలువలకు రోజు సగటున 9000 క్యూసెక్కులపైగా విడుదల చేస్తున్నారు.అంటే రోజు 0.75 టీఎంసీలు వెళుతున్నాయి.ఈ లెక్కన రానున్న 20 రోజుల్లో 15 టీఎంసీలు వెళ్లిపోతాయి.
ఈ లోపు రోజు కనీసం 2200 క్యూసెక్కుల మేర తీసుకుంటే తప్ప మనకు రావాల్సిన వాటా నీటిని తెచ్చుకోలేం.ప్రధాన కాలువ పరిస్థితి చూస్తే 1800 క్యూసెక్కులకు మించి తెచ్చుకోము.మరోవైపు గత ఏడాది డ్యామ్ డెడ్ స్టోరేజీ 26 టిఎంసిలకే అన్ని కాలువల గేట్లను మూసివేశారు.ఈ సంవత్సరం 30 టీఎంసీలకే బంద్ చేస్తారనే ప్రచారం రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.అదే జరిగితే 3 టీఎంసీలకు పైగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.
హెచ్ ఎల్ సి రెండవ దశ ఎంపీ ఆర్ డ్యామ్ కింద ఆయకట్టుకు నీరు ఇవ్వాలని రైతులు కోరితే ఎల్ నినో ప్రభావంతో పంటలకు ఇవ్వడానికి వీలు లేదు,మొదటి దశ పంటలకు నీరు ఇచ్చి తాగడానికి పొదుపు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంకా మనకు రావాల్సిన వాటా 3 టీఎంసీలు తెచ్చుకో లేకపోతే రైతులకు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు?
రావాల్సిన నీటిని తెచ్చుకోవడం చేతకాని
ఈ ప్రభుత్వం,వాటర్ మ్యాన్ బిరుదాంకిత ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి నీటిని బనకచర్ల ద్వారా కావేరికి అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పడం,చెప్పే వాడికి వినేవాడు లోకువ కాదంటారా?
వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మనకు రావాల్సిన వాటా నీటిని తీసుకురావాలి,నేడు అనంతపురం తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన జీవో నెంబర్ 3 ప్రకారం ఎల్.ఎల్.సి వాటా నీటిలో కనీసం రెండు టీఎంసీలైనా పీఏబీఆర్ డ్యామ్ కు మళ్ళించాలి,లేకుంటే అనంతపురం జిల్లాలో ప్రజలు,పశువుల దాహార్తిని తీర్చలేము.

