తొర్రూరు, నవంబర్ 13 (ట్రూ టైమ్స్ ఇండియా): రైతుల సమస్యల పేరుతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ తొర్రూరు మండల అధ్యక్షుడు బచ్చలి లక్ష్మణ్ విమర్శించారు.
ఖానాపురం గ్రామంలో ఎర్రబెల్లి పర్యటనను నిరసిస్తూ గురువారం డివిజన్ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోతే, ఆ పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు.
ఖానాపురం గ్రామంలో మొక్కజొన్న పంట కోత కోసి విక్రయించిన అనంతరం ఖాళీగా ఉన్న పొలంలోకి వెళ్లి పంట ఎండిపోయిందంటూ ఎర్రబెల్లి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర ఆయనదేనని ఆరోపించారు.
రైతులపై నిజంగా ప్రేమ ఉంటే గతంలో సంపాదించిన ఆస్తుల నుంచి బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్షపాతం, పంట నష్టం అంచనాల ఆధారంగానే పరిహారం ప్రకటిస్తారని, ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు.
కాళేశ్వరం అవినీతిని బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎర్రబెల్లి చేసే విమర్శలు, హెచ్చరికలకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడబోదని బచ్చలి లక్ష్మణ్ స్పష్టం చేశారు.

