ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలి
ప్రభుత్వ ఆదాయంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి
మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి సారించాలి: సైదం వెంకటేశులు
ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా):
ఉరవకొండ పట్టణంలో నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించాలనుకునే వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చేనేత కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి సైదం వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పట్టణంలో వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
పట్టణంలోని టవర్ క్లాక్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ క్రాసింగ్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, వాటి పరిసరాల్లోని ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంపౌండ్ సమీపంలోనూ వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు నిర్మిస్తే నిరుద్యోగ యువతకు దుకాణాలు కేటాయించడంతో పాటు ప్రభుత్వానికి అద్దె రూపంలో ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.
ఒకవైపు నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు ప్రభుత్వానికి శాశ్వత ఆదాయ వనరులు సమకూర్చేలా ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఉరవకొండలో ఒకప్పుడు కార్మికులకు ఉపాధి కల్పించిన స్పిన్నింగ్ మిల్, షీట్ మెటల్ వర్క్‌షాప్ వంటి చిన్న పరిశ్రమలు మూతపడటంతో వాటిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి చెల్లాచెదురయ్యారని తెలిపారు. అదేవిధంగా చర్మకారుల శుద్ధి కేంద్రం మూతపడటం, గట్టు రమణప్ప వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడం పట్టణ అభివృద్ధిపై నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసి వాణిజ్య సముదాయాలుగా తీర్చిదిద్దితే ఉరవకొండ పట్టణ రూపురేఖలు మారడంతో పాటు వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు లేక పలువురు యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పయ్యావుల కేశవ్ తన సొంత నియోజకవర్గమైన ఉరవకొండ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, పట్టణాన్ని వ్యాపార అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని సైదం వెంకటేశులు కోరారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకొని షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు చేపట్టకపోతే యువత, చిరు వ్యాపారులు ఉపాధి కోసం వలసబాట పట్టాల్సిన పరిస్థితి కొనసాగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

