True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

అయ్యప్ప దేవస్థానంలో ఆధిపత్య పోరు!


 

 అన్నదాన సేవా సమితికి గది కేటాయింపుపై వివాదం.. అభివృద్ధి పనులకు అడ్డంకులంటూ భక్తుల ఆవేదన

ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా) నవంబర్ 22:

ఉరవకొండలోని ప్రముఖ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. దేవస్థాన నిర్వహణ, సౌకర్యాల కల్పన, అన్నదాన సేవల విషయంలో కొందరు దీక్షాపరులైన స్వాములు, సీనియర్ స్వాముల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అన్నదాన సేవా సమితి నిర్వాహకులు దాతల సహకారంతో నిర్మించిన గదిని తమ సేవా కార్యక్రమాల నిర్వహణకు కేటాయించాలని కోరగా, అందుకు కొందరు సీనియర్ స్వాములు అంగీకరించడం లేదని అన్నదాన సేవా సమితి వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాతలు సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి గది నిర్మాణానికి సహకరించారని, దీక్షాపరులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టారని వారు పేర్కొంటున్నారు. అయితే గది కేటాయింపు విషయంలో తలెత్తిన వివాదం సేవా కార్యక్రమాలకు ఆటంకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దేవస్థాన ప్రాంగణంలో ప్రైవేటు వాహనాల పార్కింగ్ వ్యవహారం కూడా వివాదానికి దారితీస్తోంది. దేవస్థాన ప్రాంగణంలో చౌకధాన్యం సరఫరాకు సంబంధించిన వాహనాలు, రాజకీయ నాయకుల చిత్రాలతో కూడిన వాహనాలను నిలిపి ఉంచడంపై కొందరు అయ్యప్ప స్వాములు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన దేవస్థాన ప్రాంగణాన్ని ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు కేంద్రంగా మార్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై దేవస్థాన నిర్వాహకులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

ఏది ఏమైనా దేవస్థానంలో వ్యక్తిగత ఆధిపత్యాలు, వర్గ విభేదాల కంటే భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, అన్నదాన సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు. దాతల సహకారంతో చేపట్టే సేవా కార్యక్రమాలకు అడ్డంకులు లేకుండా సంబంధిత పెద్దలు చొరవ తీసుకోవాలని, నెలకొన్న విభేదాలకు సామరస్యపూర్వకంగా తెరదించి అయ్యప్ప స్వాముల సేవలకు సహకరించాలని భక్తులు కోరుతున్నారు.


↑