కుందుర్పి: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పట్నంశెట్టి పి. హేమలతను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆశీస్సులతో పాటు టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ్ మద్దతుతో ఈ ఎంపిక జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి హేమలత అభ్యర్థిత్వానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పిలేపల్లి గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, గ్రామ ప్రజలందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

