True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

పెళ్లికి నిరాకరణ.. ఎస్సై అభ్యర్థిని ఆత్మహత్య

 

                 

18 పేజీల సూసైడ్ నోట్‌లో ప్రేమ వ్యవహారంపై ఆరోపణలు..

మహబూబాబాద్, నవంబర్ 14 (ట్రూ టైమ్స్ ఇండియా): ప్రేమ వ్యవహారంలో ఎదురైన పరిణామాలు, పెళ్లికి నిరాకరణతో మనస్తాపానికి గురైన ఎస్సై అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది.

మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన సుస్మిత శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం మహబూబాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో ఆమె ఎస్సై ఉద్యోగానికి శిక్షణ పొందుతున్నట్లు సమాచారం.

మృతికి ముందు సుస్మిత 18 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. అందులో అనిల్ అనే యువకుడితో తనకు ఏర్పడిన పరిచయం, ప్రేమ వ్యవహారం, అనంతరం ఎదురైన పరిణామాలను వివరించినట్లు సమాచారం. అనిల్‌తో ప్రేమలో ఉన్న సమయంలో తాను గర్భం దాల్చగా, గర్భస్రావం కోసం నిద్రమాత్రలు ఇచ్చి మోసం చేశాడని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది.

ప్రేమ వ్యవహారంలో కులం ప్రస్తావన లేకపోయినా, పెళ్లి విషయం వచ్చేసరికి కులం పేరుతో దూషిస్తూ తనను మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అనిల్‌తో పాటు అతని స్నేహితురాలు నవ్యశ్రీ, అనిల్ తల్లిదండ్రుల పాత్రపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె లేఖలో కోరినట్లు తెలుస్తోంది.

సుస్మిత మరణవార్త తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అండర్ బ్రిడ్జి వద్ద సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించాయి. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యువతి చేసిన ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

↑