వేటకొడవళ్లతో చంపి పాతిపెడతామంటూ హెచ్చరికలు.. ఆర్డీఓ కార్యాలయం ఆవరణలోనే ఘటన?
ఉరవకొండ, నవంబర్ 16 (ట్రూ టైమ్స్ ఇండియా):
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ అధికారులను ప్రశ్నించినందుకు ఓ ఆర్టీఐ కార్యకర్తకు ప్రాణహాని బెదిరింపులు ఎదురైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. వేటకొడవళ్లతో చంపి పాతిపెడతామంటూ ఏడుగురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు కురవ లక్ష్మీనారాయణ జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు
వివరాల్లోకి వెళితే.. విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలోని పొలం సర్వే నంబర్ 332/Dకు సంబంధించిన వివాదంలో వాస్తవ సమాచారాన్ని కోరుతూ లక్ష్మీనారాయణ సమాచార హక్కు చట్టం కింద మండల, ఆర్డీఓ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిర్ణీత గడువులోగా అధికారులు కోరిన సమాచారం అందించకపోవడంతో ఆయన ఉన్నతాధికారులకు అప్పీలు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమక్షంలో విచారణ జరిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆర్టీఐ కార్యకర్తను ఏడుగురు వ్యక్తులు బెదిరించారని ఆరోపించారు. ఆర్. శ్రీనివాసులు, ఎం. చంద్రబాబు అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేటకొడవళ్లు తీసుకొచ్చి, 'వీడి కథ ముగిస్తాం' అంటూ తీవ్ర హెచ్చరికలు చేసినట్లు ఫిర్యాదులో వివరించారు.
కొట్టాలపల్లిలో తనకు ఇల్లు, స్థలానికి సంబంధించిన వివాదం ఉందని, ఈ వ్యవహారంలో కొట్టాలపల్లి వీఆర్వో రంగప్ప నాయుడు సైతం తనపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులకు సహకరించినట్లు బాధితుడు ఆరోపించారు.
ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఘటనను తన సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా, నిందితులు మరింత దూకుడుగా వ్యవహరించారని తెలిపారు. కొట్టాలపల్లిలోని గరగసేను వంకలో చంపి పాతిపెడతామంటూ హెచ్చరించి వెళ్లినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన కార్యకర్తలపై ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయ ఆవరణలోనే ఇటువంటి ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడం అధికార యంత్రాంగం భద్రతా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈ ఘటనపై బాధితుడు జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా కలెక్టర్, రాష్ట్ర సమాచార కమిషనర్లకు రిజిస్టర్డ్ స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదులు పంపినట్లు తెలిపారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, సమస్య పరిష్కారమయ్యే వరకు పోలీసు రక్షణ కల్పించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
భవిష్యత్తులో తనకు లేదా తన కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రాణనష్టం జరిగినా అందుకు తనను బెదిరించిన వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఫిర్యాదులో స్పష్టం చేసినట్లు బాధితుడు తెలిపారు.

