శ్రీకాకుళం: శ్రీకాకుళం మండలం శానివాడ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర వివాదానికి దారి తీసింది. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎచ్చెర్ల దివ్య స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినప్పటికీ, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాన్ని తారుమారు చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.
వివరాల్లోకి వెళితే.. మొదట జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి దివ్య 319 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే, శానివాడ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ స్వగ్రామం కావడంతో, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన రీకౌంటింగ్ చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు నిర్వహించిన రీకౌంటింగ్‌లో కూడా దివ్య 43 ఓట్ల మెజారిటీతో ముందంజలోనే నిలిచారు.
కానీ, అధికారులను మరింత ప్రభావితం చేసి, ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, చివరకు ఆమె కేవలం 6 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. చేతికి వచ్చిన విజయాన్ని అధికార బలంతో అన్యాయంగా లాగేసుకోవడంపై దివ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్దే కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, ఎమ్మెల్యే గొండు శంకర్ తీరును మరియు అధికారుల పక్షపాత వైఖరిని ఎండగడుతూ మద్దతుదారులతో కలిసి నిరసనకు దిగారు.

