ఉరవకొండ ఎంపీపీ పీఠం.. సమన్వయ నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలి!
కూటమి పార్టీల మధ్య ఐక్యత, ప్రజాసేవే ప్రాతిపదిక కావాలి
అభిప్రాయం వ్యక్తం చేసిన కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు దగ్గుబాటి శ్రీరామ్
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవి ఎవరికి దక్కుతుందన్న అంశంపై రాజకీయ వర్గాలతో పాటు మండల ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని కాపాడుతూ, అందరినీ కలుపుకొని వెళ్లగల నాయకత్వానికి ఎంపీపీ బాధ్యతలు అప్పగించాలని ఉరవకొండ కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు దగ్గుబాటి శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.
కూటమిలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ఆధిపత్యాలకు తావులేకుండా సమష్టి నిర్ణయంతో ఎంపీపీ ఎంపిక జరగాలని సూచించారు.
ఎంపీపీ పదవి కేవలం రాజకీయ హోదా మాత్రమే కాదని, మండల అభివృద్ధికి ప్రజలకు సేవ చేసే బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాల సమస్యలపై అవగాహన కలిగి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకునే వ్యక్తికి అవకాశం కల్పిస్తే అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతాయని అభిప్రాయపడ్డారు.
పదవుల కంటే ప్రజాసేవకు, రాజకీయ ప్రయోజనాల కంటే కూటమి ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని దగ్గుబాటి శ్రీరామ్ కోరారు. అందరినీ కలుపుకుపోయే నాయకత్వమే ఉరవకొండ మండల ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు.
